విశీ – ప్రపంచాన్ని సైతం విశదీకరించి రెండే ముక్కల్లో చెప్పాలనుకున్న విషయం విపులంగా చెప్పారు.
ఏదైనా విషయం చెప్పాలంటే వాటికి పాత్రలు, పాత్రలకి పేర్లు, పాత్రలకు బంధాలు, సన్నివేశాలు, ప్రేమలు, పకడ్బందీగా తయారు చేసి రాసి మెప్పించాలి. కానీ, ఇక్కడ ఇంత సులువుగా క్లుప్తంగా చెప్పాలనుకున్నది మైన్యుట్ వివరాలతో కట్టె, కొట్టే, తెచ్చే లాగా టాప్ మని పడిన తలుపు చప్పుడులాగా ఫట్ మని పేలే బుడగలాగా, ఒక్క ముక్కలో ఫసక్ చేసేసారు రచయిత గారు.
కొన్ని విషయాలు బాగా మదిలో అలజడులు రేపాయి ముఖ్యంగా నవ్వుతున్న దెయ్యం చదువుతున్నప్పుడు మొన్నీమధ్య నేను రాసిన “చీకటి తెరలు” కథ కనుల తెర ముందు కనపడి కంటతడి పెట్టించాయి.
ఇవి మైక్రో కథలు కానీ మనిషి ఆలోచనల్లోని ఆంతర్యాలను మ్యాక్సిమైస్ చేసిన మినీ సైజ్ కథలు. కథ నిడివి ఎంతైనా ఉండచ్చు, కానీ నడిపించే కథనం సరైనదిగా ఉండాలి, అప్పుడు నిముషం కథ కూడా మనల్ని ఆకాశం అంచుల్లో ఉన్న మేఘాల మాదిరిగా, ముసురు కమ్ముకుని లోన నింపుకున్న నీళ్ల మాదిరి, భూమి చుట్టూ తిరుగుతూ సరైన చోట, సరైన సమయానికి కురిసేలా చేశాయి.
సాధారణంగా ఎవరి జీవితంలో అయినా కూడా పరిస్థితులు వేరుగా ఉన్నా కూడా వాటికి పరిష్కారాలు ఒక్కటిగా ఉంటాయ్. కానీ, ఇక్కడ పరిస్థితులు వేరైనా వాటికన్నా జీవితాలు, ఆ జీవితాల వెనుక బాధలు ఒక్కటే. ఏమని అడిగినందుకు బ్రతుకు మీద మాయని మచ్చ చేసాడు, ఒకప్పుడు ఉన్న మనిషిలా ఇప్పుడు తాను ఉండటం లేదు, అనుమానం పెనుభూతం అంటారు మరి ఆ అనుమానం వచ్చేలా ఎందుకు ప్రవర్తించాలి? జ్యోతిష్యం అంటే జాతకాలు చూడటమానే అంటారు, మరి అలా చూసిన వారు జాతకంలో ఏ సమయంలో ఏమి ఎదురవుతుందో ఎందుకు చెప్పరో ఏమిటో.
ట్రామా ఉండటానికి రెండక్షరాలే కానీ అది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇది హారాస్మెంట్కి గురి అయిన ప్రతీ ఒక్క అమ్మాయికి, అబ్బాయికి సుపరిచితమే. చెప్పడానికి సులువుగా ఉన్నా ఎన్నో నిద్రలేని రాత్రులు, దపడుకునే దిండుకి మన కన్నీళ్లను పరిచయం చేయడం, చిన్న శబ్దం విన్నా ఉలిక్కిపడటం, చీకటిని చూస్తే ఉచ్చ పడటం అన్నీ కామన్ మన పక్కవారికి. కానీ, అవి అనుభవించిన వారికి జీవితాంతం చెరగని చేదు జ్ఞాపకాలు. మోస్తుంటే భుజాలు బరువెక్కడం కాదు, ఊపిరి కూడా భారంగానే అనిపిస్తుంది. ఎందుకీ జీవితం అనిపిస్తుంది. చచ్చిపోదామన్నా ధైర్యం చాలదు. ఎవరికైనా చెప్పుకుందామంటే అందరూ జడ్జ్ చేసేవారే కానీ, అండగా ఉండేవారు ఒక్కరూ కనపడరు. పెరిగే కొద్ది ఆ భయం దెయ్యంలా వెంటపడుతుంది, మన నడవడిలో తేడా గమనించిన వారు అయినా ఏమైందని తెలుసుకునే ప్రయత్నం చేయరు. మనల్ని జడ్జ్ చేసి మూలన పడేస్తారు. దానికంటే ఒంటరిగా నలగడం మేలు అనిపిస్తుంది. సమాజానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలనిపిస్తుంది. పీల్చే శ్వాస కూడా బరువుగా మారినప్పుడు ఆ జీవితం ఎంత దుర్భరంగా మారి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ముప్పై కథలు ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ ఆడవారి మీదే. ఎక్కువ శాతం వారే కదా ఈ భూప్రపంచం మీద బాధించబడుతుంది. వారి కథలు అందరికీ తెలియాలి. ఎలా వేధించబడుతున్నారో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఎలా అణచివేతకు గురి కాబడుతున్నారో తెలుసుకునేలా చేసి వారికి అండగా నిలబడాలి. ఇవి కథలు కాదు జీవితాలు. ఎందరో స్త్రీల మనో వేదనలు. బ్రతుకుతున్న జీవితం బ్రతకలేక చస్తూ బ్రతుకుతున్నారు. బయటకి వారి బాధ చెప్పుకోలేక అవస్థ పడుతున్నారు. వ్యవస్థ నిండా మంచి ముసుగు వేసుకుని, అందరినీ ఉద్దరిస్తున్నాం అనే ఉద్దండులే, లోపల ఎవరికీ తెలియని మృగాలను పెట్టుకుని, శారీరకంగా, మానసికంగా వేదిస్తూ, పైశాచికానందం పొందుతున్నారు.
వాటిని మన రచయిత గారు చాలా లోతుగా పరిశీలించి మనకు అందించారు. చదువుతుండగానే కన్నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేశాయి. పేజీ తడిచిపోతే ఏంటా కల్లు సరిగ్గా మసక మసక కనిపిస్తున్నాయి అని చూశాను. అప్పుడు కానీ తెలియలేదు, ఇందులో నాకు తెలియకుండానే నాకు లాగా జరిగిన ఇంకో కథ కూడా ఉందని. నాకు లాగే ఎంతో మంది ఈశ్వర్లు ఈ కామ పిశాచాలకి బలి అయ్యారని నిన్న రాత్రి ఈ పుస్తకంలోని చివరి కథ “జ్వరం” చదివాక నన్ను నేను చూసుకున్నాను.
ఈ పుస్తకంలో లేకలేనన్ని జీవితాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి. తెలుసుకుని పక్కవారితో మీరు అలా లేకుండా ఉండటానికి ప్రయత్నించండి. వారి బాధలు ఎవరైనా చెబుతుంటే వినండి, మధ్యలో దూరి మీ బాధలు వారిపై రుద్దకండి. వారు మొత్తం చెప్పాక మీరు చెప్పడం ప్రారంభించండి. అంతేకానీ, వారు చెబుతున్నారు కదా అని, మధ్యలో దూరేసి ముందే లేనిపోనివి అన్నీ చెప్పి వారిని ఇంకా భయపడేట్టు చేయకండి.
వెల: 150/-
లింక్స్: https://pusthakam.in/product/micro-kathalu/