మావాడు మాట ఇండమే లేదు వీణ్ణి తీసకపోయి హాస్టల్లో నూకాలా అని మా ఇస్సాకు పెదనాన ఎన్ని సార్లు చెప్పేవాడో మా అన్న గురించి. కానీ వాడు ఒక్కసారి కూడా హాస్టల్ కి పోలేదు..
హాస్టల్ అంటే క్రమశిక్షణ అలవాటు పడుతుంది అని ఒక ఆశ .. అక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అనే విషయం తెలిసినా వాళ్ళ బాగుకోసం అనే ఒక్క మాట కన్నపేగు బంధాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది.
హాస్టల్ లైఫ్ చదువుతూ ఉన్నంత సేపు తమాయించుకోలేని సంఘటనలు మనకెన్నో తగులుతాయి. ఇంటికాడ అల్లరి చేస్తున్నాడనో, మంచిగా సదివి ఉజ్జోగాన్ని వెలగబెట్టాలనో , లేదా వాడ కట్టులో ఉండే పిలల్లలకి వేరుగా ఉంచాలనే కోరికలతో అక్కడికి వెళ్లిన పిల్లల పాట్లు, అక్కడ ఆనాటి కి పనిచేస్తున్న ఉపాధ్యాయుల వైఖరి, పురుగుల అన్నం,
ఎప్పటికి మర్చిపోలేని సాయంత్రాలు చాలా కలవర పెడతాయి. మీకు హాస్టల్ అనుభవం లేకుంటే ఈ పుస్తకం చదవండి.పిల్లలని హాస్టల్ కి పంపడానికి మీరు సాహసం చేయరు. మీకు హాస్టల్ అనుభవం ఉంటే చాలాసార్లు కన్నీళ్లు తుడుచుకుంటారు.
ముప్పై ఎకరాల విస్తీర్ణంలో కట్టిన హాస్టల్లో ఒక్క మగ్గు నీళ్లకోసం దళిత విద్యార్థులు పడిన వెతలు ,కడుపు దుపలరించుకోవడానికి పడిన అవస్థలు, గజ్జి వంటి అంటువ్యాధులు వచ్చినా క్లాసులో గోక్కుంటే కొట్టే మనసులేని ఆనాటి టీచర్లు, కన్న తల్లి తో మాట్లాడి కాస్త ఆలస్యంగా స్టడీ అవర్ కి లేట్ గా వస్తే ఆమె ముందే కొట్టిన పంతులు నిర్వాకం. మదర్ తెరీసా లాంటి ఒకేఒక లేడీ టీచర్ కి రాసిన అసభ్య ఉత్తరం ఎవరు రాశారో తెల్సినా సరే దాన్ని పిల్లల మీదకి నెట్టి చీకటి కొట్లో నెట్టిన గాధ..
ఇది జీవితం కాదు. బాధలో చిన్న చిన్న ఆనందాలు కోరుకునే ఒక టీనేజర్ మనకి రాసిన ఉత్తరం. తప్పక చదవండి… ఇందులో జీవితాన్ని వాస్తవం లోనుంచి ఎలా కష్టాలని దాటాలో ఉంటుంది. అనేక మలుపులు ఉంటాయి. వాటిని దాటడంలో మోహన్ అమాయకత్వం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. తెగింపు ఉంది. చిలిపితనం ఉంది. స్వరాజ్యం కోసం పడిన ఆరాటం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆ జీవితం ఇలా మనముందుకు వచ్చింది.