సబాల్టర్న్‌ చరిత్రలో మైలురాయి

స్త్రీల చరిత్ర అంటే ‘అగ్ర’వర్ణ స్త్రీలదే అని ఎనుకటి నుంచి రాస్తూ, ప్రచారం చేస్తూ, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిస్తూ, ఎగ్జామ్స్‌ల్లో ప్రశ్నలై వెలుగుతూ వచ్చిన బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని చల్లపల్లి స్వరూపారాణి తుత్తునియలు చేసింది. నిజానికి ఆధునిక భావజాలంతో మొదటి సారిగా పుస్తకం రాసి ప్రచురించిన మహిళామూర్తి సావిత్రిబాయి ఫూలే. ఈమె గురించి 1980, 1990లలో బయలుదేరిన స్త్రీవాదులు పెద్దగా పట్టించుకోలేదు. 39 ఏండ్లకే చనిపోయిన దళిత అకడెమీషియన్‌ షర్మిల రెగె రాసే వరకు మహారాష్ట్రలో అంబేడ్కర్‌తో కలిసి నడిచిన మహిళల గురించి చాలా మందికి తెలియదు. విదేశీయులైన గెయిల్‌ ఒంవెట్‌, ఎలియానార్‌ జీలియట్‌ రాసే వరకు, మీనాక్షి మూన్‌, ఊర్మిళ పవార్‌లు కలిసి ‘వి ఆల్సో మేడ్‌ హిస్టరీ: విమెన్‌ ఇన్‌ ద అంబేడ్కర్‌ మూవ్‌మెంట్‌’(2008) పేరిట విస్మృత చరిత్రను నిర్మించే వరకు దళిత మహిళలు కూడా చరిత్రకెక్కదగ్గవారే అనే సోయి లేదు. తెలుగులో ఈ లోటును గోగు శ్యామల ‘ నల్ల పొద్దు’ కొంత తీర్చింది. ఇప్పుడు ‘మిణుగురులు’ పేరిట నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులు చల్లపల్లి స్వరూపారాణి నంగేలి మొదలు సీతక్క వరకు మొత్తం 26 మంది ‘బహుజన’ మహిళలకు చారిత్రక గౌరవం కల్పించింది. ఇందులో చాలా వరకు గతంలో చదివినవే అయినప్పటికీ పుస్తకంగా ఒక్కదగ్గరికి రావడం సంతోషం.

సావిత్రిబాయి ఫూలేతో పాటు ఆమె తదనంతరం సత్యశోధక్‌ సమాజ్‌ కార్యక్రమాలను నడిపించి మహారాష్ట్రలో ‘విద్యాదేవి’గా గౌరవం పొందిన వడ్డెర మహిళ సావిత్రిబాయి రోడె, సావిత్రిబాయి ఫూలే సహాధ్యాయిని, సహాధ్యాపకురాలు ఫాతిమాషేక్‌, స్ఫూర్తి మూర్తి రమాబాయి అంబేడ్కర్‌, రాజ్యాంగ ధర్మాసనంలో స్థానం పొందిన ఏకైక దళిత మహిళ దాక్షాయణి వేలాయుధన్‌, ఈమె లాగే కేరళ రాష్ట్రానికి చెందిన పోరాట యోధురాలు నంగేలి, బండిట్‌ క్వీన్‌ పూలన్‌ దేవిల చరిత్రలు రాష్ట్రేతరులవి మిగతావన్ని తెలుగువారి తెగింపు చరిత్రలే!

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన యానాదులు, చెంచులు, దళితులు, కోయ మహిళల స్ఫూర్తిని ఇందులో అక్షరబద్ధం చేసిండ్రు. అరునాంక్ ముందుమాట వివరణాత్మకంగా ఉన్నది. ( టైమ్ తీసి విశ్లేషణాత్మకంగా రాయాలని రిక్వెస్ట్). కచ్చితంగా ఈ రచన సబాల్టర్న్‌ సాహిత్యంలోనూ, చరిత్రలోనూ చిరస్థాయిగా నిలిచిపోయే మైలురాయి. దళిత, బహుజన, మైనారిటీ పాఠకులు పెరిగినంతగా వారికి అవసరమైన రచనలు, పరిశోధనలు చాలా అరుదుగా సాగుతున్నాయి. ప్రచురణ మరింత అరుదు. ఈ అరుదైన ప్రచురణ గౌరవాన్ని దక్కించుకున్నందుకు ‘పర్‌స్పెక్టివ్‌’ బాధ్యులకు అభినందనలు. అయితే ఈ పుస్తకానికి ‘ఆత్మగౌరవ పోరాట ధిక్కార కథనాలు’ పేరిట ఆర్‌కె (పర్‌స్పెక్టివ్‌ తరపున) రాసిన ముందుమాట ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నది. ఈ ముందుమాటలో ‘చరిత్రలో స్త్రీల, అందునా బలహీన వర్గాల స్త్రీల, పాత్రను ఉద్దేశపూర్వకంగానే అగ్రవర్ణ చరిత్రకారులు నమోదు చేయలేదు. ఐతే సమాజంలో వస్తున్న అనేక సామాజిక, సంస్కరణోద్యమాల ఫలితంగా ఈ చరిత్రలను అణచివేతకు గురైన స్త్రీలే తిరగరాస్తున్నారు. దళితుల, మైనారిటీల, ఆదివాసీల జీవితాల పట్ల, వారి చరిత్రల పట్ల కనిపించే వివక్షను ఎత్తి పడుతూ సరికొత్త చరిత్రను వెలుగులోకి వీళ్ళు తెస్తున్నారు. ఈ కృషిలో అంబేడ్కర్‌ దార్శనికత మార్గదర్శిగా వీళ్లు చరిత్రకు కొత్త వాకిళ్లు తెరుస్తున్నారు’’ అని ఆర్‌కె రాసిండు.

‘దళితుల, మైనారిటీల, ఆదివాసీల జీవితాల పట్ల, వారి చరిత్రపట్ల కనిపించే వివక్ష’ అని పేర్కొనడం ద్వారా ఆర్‌కె బహుశా ఉద్దేశ్య పూర్వకంగానే ఈ పదబంధంలో బీసీ స్త్రీలను విస్మరించారు. ఆయన దృష్టిలో బీసీలు పీడితులు కారా? లేదా పోరాట స్ఫూర్తి ప్రదాతలు ఈ సామాజిక వర్గాల్లో లేరనా ఆయన ఉద్దేశం. వారి గురించి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాల్సిన అవసరమున్నదని ఆర్‌కె గానీ ‘పర్‌స్పెక్టివ్‌’ సంస్థ గానీ ప్రత్యేకంగా గుర్తించే అవకాశమున్నదా?

ఫెమినిస్టు ఉద్యమాలు నడుస్తున్న కాలంలో ‘మనకు తెలియని మన చరిత్ర’ పేరిట ‘అన్వేషి’ సంస్థ ఆధిపత్య కుల స్త్రీల ఉద్యమాలను ఒకరిద్దరు బీసీ స్త్రీలను చేర్చి వెలువరించింది. సాయుధ పోరాటమంతా ఆధిపత్యకులాల వాళ్ళే చేశారనే అభిప్రాయాన్ని మానుఫాక్చర్‌ చేసింది. నిజానికి 200ల ఏండ్ల కిందటే బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించిన గుంటూరు జిల్లా పద్మశాలి స్త్రీ ‘దార్ల సుందరమ్మ’ రాసిన భావలింగ శతకం గురించి ఇప్పటికీ పెద్దగా ఎక్కడా చర్చలేదు. తెలంగాణ పోరాట యోధురాండ్రు చాకలి ఐలమ్మ, సంగెం లక్ష్మీబాయమ్మ, సాహితీ సంపన్నురాలు గిడుతూరి రామానుజమ్మ, విద్యాదాత శ్యామలాదేవి, పరిశోధనే పరమావధిగా పనిచేసిన సరోజిని రేగాని ఇట్లా కొన్ని వందల మంది బీసీ స్త్రీలు చరిత్రకెక్కాల్సిన వాళ్ళున్నారు. ‘దళిత, ఆదివాసీ, మైనారిటీ’ స్త్రీలతో పాటు బీసీ మహిళలూ అణచివేతకు గురవుతున్నవారే, వీరూ చరిత్రకెక్కదగ్గవారే అని గుర్తించాలి.

– డా. సంగిశెట్టి శ్రీనివాస్

Click the link below to buy the book

https://pusthakam.in/product/minigurulu/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart