దేవుడమ్మ మరో 10 కథలు
మొత్తం 11 కథలే కానీ ఎన్నో జీవితాల కథలు ఇవి.
రాయలసీమ మాండలీకంలో నడిచిన పల్లె కథలైనా…నగర జీవితాన్ని చూపించిన కథలైనా… ఆ నాటి విజయనగర సామ్రాజ్యం లోని ఓ ప్రేమ కథ అయినా… అన్నీ వేటికవే. చాలా వరకు కథల్లో స్త్రీయే ప్రధాన పాత్ర.
ఒక కథలో(దేవుడమ్మ) అత్తవారింట్లో ఆరళ్లను తట్టుకోలేక దేవుడమ్మ గా మారితే మరో కథలో( మాతమ్మ ప్రశ్న) దేవుడి మొక్కులను తీర్చడానికి తర తరాలుగా మాతమ్మలుగా మారిపోతున్న దీపలు. ప్రేమ కోసం పరితపించే రాయలకాలం నాటి కథ లో ‘ఏక పర్ణిక’ , ఈ నాటి కథ మూవ్ ఆన్ లో ప్రవీ … ఇలా.LGBT నేపథ్యంలో వచ్చిన కథ ‘ద్వైతం’.మనం కొన్ని సమస్యలకి పరిష్కారం చూపించలేక పోవచ్చు కానీ మన దృష్టికోణం కనీసం మార్చుకుంటాం ఇది చదివితే.
మరో మంచి కథ ‘నీరుగట్టోడు’ పల్లెటూరిలో చెరువులో నీటితో సమానంగా అందరి పొలాలను తడి చేయగలిగే నీరుగట్టోడికి దక్కింది నగరం లో కొడుకు, కోడలి ఎండిపోయిన మనసులే.
జర్నలిస్ట్ గా వారి అనుభవాలని, పల్లెటూరితో వారి అనుబంధాన్ని , ఆ ప్రజల జీవితాలని, ఆక్కడి మాండలికాన్ని కథల్లో చక్కగా చిత్రీకరించేరు రచయిత్రి ఝాన్సీ పాపుదేశి గారు.
నా వరకు నాకు మాండలీకంలో ఉన్న కథలు చాలా నచ్చుతాయి. అది ఏ ప్రాంతానికి సంబంధించినా. ఆ విధంగా కూడా చాలా తృప్తి నిచ్చాయి ఈ వైవిధ్యభరితమైన కథలు.
Devudamma