దుఃఖాన్ని చూసే , రాసే వాళ్ళ కంటే దుఃఖాన్ని మోసే వాళ్ళు ఇంకా బాగా రాయగలరూ. ఓపెన్ కాస్ట్ మింగడానికి ఇంకా ఊర్లు ఉన్నయ్..రాజాపుర్, రామయ్యపల్లి ( బుదవారంపేట), ఆదివారం పేట,లద్నాపుర్, సిద్దపల్లే, రచ్చపల్లే, మల్లారం, తాడిచేర్ల, తుండ్ల, పెద్దంపేట, మంగలపల్లే, నాగేపల్లి, అడ్డ్యాల, సిరిపురం, మేడివాక ,చందనాపుర్… చాలానే ఉన్నయి మట్టిలో కలిసిపోడానికి.చాలానే కనుమరగయ్యాయి సింగరేణి కేవలం భూమిని తవ్వలే.. పొట్టతోని ఉన్న తల్లుల కడుపుల్ని తవ్వింది..పేగు పేగుని బుల్డోజర్ చీరింది. సింగరేణిని రాస్తే ఓ గుట్ట పుస్తకాలు అయితయ్.. ఎప్పుడో అల్లం రాజయ్య రాసిన అతడులో బతుకు సదివిన. అంటరాని వసంతం అంతా కోల్డ్ బెల్ట్ ఏరియలనే కనిపిస్తది…

పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బొడ్రాయి ఎవరి పాదాల కింద ఉందో తెలీదు.. ఊరు. బొగ్గు పెడ్డల్లో కలిసిన ఊరు.. నేను పుట్టిన ఊరు మాత్రమే నా ఊరు కాదు…నేనుతిరిగిన నేలంతా నా ఊరే. నన్ను నేను ఎతుక్కున్న ఊరు.. నా ఊరు మాయం కాలే.. అణిచేసారు భూ పొరల్లోకి. గోదావరిఖని, మంథని నిఖార్సైన పల్లెలని చేతుల్లో దాచి ఉంచితే అవే స్మృతులు లేకుండా మట్టి పొరల్లో కప్పబడ్డయ్ మరో తరానికి తెల్వకుండా..ఈడి తెలుగు కళ్ళల్లో మాయమైన గుర్తుల్ని కన్నీళ్ళతో చెప్తది. గుండెల్లో సుడులు తిరిగిన జ్ఞాపకాల్ని తడారని గొంతుంతో చెప్తది. తంగేడు సెట్టేనుక మా మావను ఎర్రగా చేసిర్రు… మోట చేదే మాయవ్వ మావ రాడని బొక్కం సేదుకుంటనే సోయి తప్పి అల్లే వడి సచ్చి పోయింది. సేనుకాడాబాయి బాటల్నే మా అన్న నడిసచెట్టోడు..మా అన్న నడిసే తొవ్వ లేదిపుడు..తొవ్వల్ల తట్టలు ఉన్నయ్. గంపళ్ళల్ల దాసిన నా అయ్య తువ్వల్లలు లేవు.. అదొక్కటే మిగిలిన గుర్తు ఇప్పుడు ఆ గుర్తుల్లేవు.. గట్లమీద నుంచి నడిసాత్తడని మళ్ళ మళ్ళ బాటలను సూసే తల్లులూ లేరని బాధ గొంతును చెప్తది. నాయినలు, కాకలు, పొగలు పొగలు తీసే స్టయిల్ తాతలు, సెరువు, అరుగు, అలుగులు, కచ్చిర్లు లేవు .. ముచ్చట్లు అన్నీ విన్న మూల మలుపులు లేవూ..ఎవి లేవు.. మా అస్తిత్వం లేదు.. గుండెల్లో కుచ్చే ముళ్లులాంటి జ్ఞాపకాలు లేవూ.. ఊపిరిని ఇచ్చే కథలు లేవూ.. బోగ్గుల్లో కాలిపోయిన తాత ఆనవాళ్లు లేదు..
ఎవరెవరో వచ్చిపోయారు ఎవరెవరో చచ్చిపోయారూ..వాళ్ళు లేరు వాళ్ళ అడుగులు లేవూ..వారిని అడిగే మనసెరిగిన మనుషులు లేరూ.. వాళ్ళ కోసం కట్టిన గోరీలు లేవూ.. వాళ్ళని అడిగిన కథలు కథలుగా గుక్క పెట్టకుండా చెప్పే బాపమ్మలు , తాతలు లేరు.. ఎవరున్నారో ఎవరు లేరో ఎవరి ఎవరికి తెలీదు. కాలీ యదుల్ని కళ్ళల్లో ఉంచుకుంటూ మేమున్నాం.. బతుకును ఇస్తున్న జాగని ఊరు చేసుకున్న కూడా సొంతమంటు ఊరు లేదని మరెన్నో ఊర్లు ఉండవని తెలిసిన ఇంకా మేమున్నాం. ఊరగల్ల మనాదులకి దూరంగా మేమున్నాం.బూడిద గుట్టల్లో మేము ఇంకా కుప్పలు కుప్పలుగానే కప్పబడి ఉన్నాం.. ఇంకా తలుస్తునో..రాస్తునో.. చూస్తునో…అన్ని కోల్పోయి మోడుల మేమున్నాం.అభివృద్ధి పేరిట జరుగుతున్న నష్టాన్ని పుడ్చే మనుషులు ఉండరు.. కడుపుకోత మిగులుస్తున్న ఆ అభివృద్ధిలో మమ్మల్ని కలుపుకోనూ పోరూ.. సూఫీ డాడీ నువ్ ఈ బుక్ రాయడం చాలా సంతోషంగా ఉంది. రాయవేమో అనుకున్న. యేనాటికీ వస్తదో అస్సలు రాస్తవో లేదో అనుకున్న..దుమ్ములో ఒక వంతుగా కలిసిన పెగల్లేని గొంతుల్ని, గాలిలో తేలియాడే జీవితాల్ని రాయూ.. వెలుతురూని పంచుతూ చీకట్లో నెట్టివేయబడ్డ నిజమైన మనుషుల్ని రాయూ ..ఇలా రాస్తూ రాస్తూ మాయమైన ఊర్లని బతికించూ…