సుధాకర్ అదాటుగా రాయడం కాకుండా ఆలోచించి సాహిత్య రూపంలో వ్యక్తమవుతాడు. సృజనాత్మక భాష మీద ఆయనకు సాధికారత ఉంది. కనుక తన విశ్లేషణను సృజనాత్మకం చేయడం కోసం ప్రయత్నించాడు. కవి, కథకులు, విమర్శకులు… ఎవరైనా తమ సామాజిక నేపథ్యం నుంచి సాహిత్యంలో వ్యక్తమవుతారనే ఎరుక సుధాకర్కు ఉంది. ఆయన రాసిన వ్యాసాలలో ఎంపిక చేసుకున్న భాష ప్రత్యేకంగా ఉంది. అనుసరణనో, అనుకరణనో కాకుండా తనదైన ప్రత్యేక ముద్రతో విమర్శ ప్రక్రియను చేపట్టాడు. కావ్యగత విషయాలను చెప్పడానికి దాని నిర్మాణ రహస్యం తెలిసి ఉండాలి. ఆ దినుసు సుధాకర్ వ్యాసాలలో మనకు ప్రత్యక్షమవుతుంది. కవిత్వాన్ని విశ్లేషించడానికి కవితా భాషను, కథను వివరించడానికి కథన శైలిని, విమర్శను పరిశీలించడానికి వివేచనాత్మక భాషను రూపొందించుకొని ఈ విశ్లేషణకు పూనుకున్నాడు. భాష, పరికరాలు, శైలి ఈ మూడింటి మధ్య అతడు సాధించిన సమన్వయం వలన ఒక సారవంతమైన సంభాషణ నడిచింది.
-ప్రొఫెసర్ చింతకింది కాశీం
Reviews
There are no reviews yet.